RGV : గత కొద్ది రోజులుగా మా ఎన్నికల హంగామా టాలీవుడ్‌లో నడుస్తున్న విషయం తెలిసిందే. పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒకరిపై ఒకరు అవాకులు చెవాకులు పేల్చుకున్నారు. లోకల్-నాన్ లోకల్, డబ్బుల పంపకం, కులాల ప్రస్తావన ఇలా ఎన్నో ప్రస్తావనకు వచ్చాయి. మోహన్ బాబు అయితే ఏకంగా చేయి చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి.
మా ఎలక్షన్స్‌లో మోహన్‌బాబు, నరేష్ భౌతిక దాడులకు దిగారని, బండబూతులు తిట్టారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఇదేవిషయం చెప్పారు. రాత్రి గెలిచాం.. ఉదయానికి ఓడిపోయాం.. అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. అయితే ‘మా’ సినిమా ఇంకా ముగియలేదు. వీలు చూసుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
ఇదే సందులో రామ్ గోపాల్ వర్మ ‘మా’ పరిణామాలపై తన వెర్షన్‌ను ఒక్క మాటలో తేల్చేశారు. . ‘మా’ను సర్కస్ తో పోలుస్తూ ఓ ట్వీట్ వదిలారు. ‘‘మేమంతా ఓ సర్కస్ అని ప్రేక్షకులకు సినీ‘మా’ జనం మరోసారి నిరూపించారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు చర్చకు తెరదీశారు. మెగా ఫ్యామిలీ గురించేనంటూ కొందరు, లేదూ నరేశ్ గురించే అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.