Rana Daggubati : దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రానా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించారు రానా దగ్గుబాటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో తన పేరును దశదిశలా వ్యాపింపజేసాడు. నేను నా రాక్షసి, రుద్రమదేవి, అరణ్య, విరాటపర్వం, భీమ్లా నాయక్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
రానా వ్యక్తిగత జీవిత విషయానికి వెళ్తే.. రానా దగ్గుబాటి తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి లక్ష్మిల కుమారుడు. ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చెన్నై లోని చెట్టినాడ్ విద్యాశ్రమం నుండి అభ్యసించారు. ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు. చిత్రలోని నటిస్తూ పలు టీవీ షోలో కూడా రానా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక రానా, మిహికా బజాజ్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2020 ఆగస్టు 8న వివాహం చేసుకున్నాడు.

ఇక రానా అసలు పేరు రామానాయుడు అయితే రానా అనే పేరు ఎలా పెట్టారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందట. మొదట రానాకు సిద్దార్థ్ అనే పేరును పెట్టాలని అనుకున్నారట రానా తల్లి లక్ష్మి. అయితే బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేశ్ బాబు తన తండ్రి పేరైన రామానాయుడు పేరును రాసేసారట. తాను ఎవరికీచెప్పలేదని, నాన్న పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యాను కాబట్టే పెట్టేసానని సురేష్ బాబు ఒక సందర్భంగా తెలిపారట. సురేష్ బాబు చేసిన పనికి రామానాయుడుగారు చాలా సంతోషించారట. అయితే నాన్న ఫ్రెండ్ ఒకాయన రామానాయుడు అని తాను పిలవలేనని.. రామా నాయుడు పదాల్లోని మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తానని చెప్పాడట. అలా రానా అనే పేరు స్థిరపడిపోయిందట. ఇది రానా పేరు వెనుక ఉన్న అసలు కథ. ఈ విషయాన్ని రానా ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.