Ramya Raghupathi : గత కొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటి పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, అందుకనే మహాబలేశ్వరం ఆలయాన్ని సందర్శించారని.. ఈ మధ్య కాలంలో తరచూ వార్తలు వచ్చాయి. అలాగే ఓ కన్నడ న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో నటి పవిత్రా లోకేష్ తనకు నరేష్‌తో సంబంధం ఉందని అంగీకరించింది. దీంతో వీరి కథ ఊహించని మలుపు తిరిగింది. అయితే కొత్తగా ఇంకో ట్విస్ట్ వచ్చి చేరింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
అసలు తనకు నరేష్ ఇంకా విడాకులు ఇవ్వలేదని.. రమ్య రఘుపతి అన్నారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని.. కరోనా సమయంలో తాను చెల్లించాల్సిన డబ్బులు చేతికి అందలేదని.. అందుకనే ఇతరులకు ఇవ్వలేకపోయానని.. అంతేకానీ తాను డబ్బుల విషయంలో ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. దీనిపై నరేష్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఒక జర్నలిస్ట్‌నని తనపై ఈ విధంగా ప్రచారం చేయడం బాధగా ఉందన్నారు.

తనకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ విషయం ఇంకా సెటిల్ కాలేదని.. కనుక విడాకులు తీసుకోలేదని.. తాను విడాకుల పత్రాలపై సంతకాలు చేయలేదని.. రమ్య రఘుపతి తెలిపారు. రఘువీరా రెడ్డి తనకు బంధువని అయితే ఆయన పేరును ఎప్పుడూ తాను వాడుకోలేదని అన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని.. డబ్బులు అందరికీ ఇచ్చేశానని.. తనపై ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని.. ఆమె తెలిపారు. అయితే దీనిపై నరేష్ స్పందించాల్సి ఉంది.