Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్ సినిమాలతోపాటు ఇతర విషయాలపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ అధ్యక్ష బరిలో నిలిచిన సమయంలో ఆయనను నాన్ లోకల్ అని అందరూ అన్నారు. తాను తెలుగు గడ్డపై పుట్టకపోయినా.. ఇక్కడి ప్రతీ ఇంటికీ తానెవరో తెలుసని.. తెలుగు ప్రేక్షకులు ఆదరించారని చెప్పుకొచ్చారు. అయితే మా ఎన్నికలలో ఓడిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రకాశ్ రాజ్ తెలుగు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రకాశ్ రాజ్ బెంగుళూరులో నాలుగేళ్ల క్రితం జరిగిన జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య ఘటనతో బీజేపీపై వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ప్రధాని మోదీ విధానాలను వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్ 2019 ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పలు విషయాలపై తన వాదనను వినిపిస్తూనే ఉన్నారు.
రానున్న రోజులలో ప్రకాశ్‌రాజ్ జనసేన గూటికి చేరబోతున్నారన్న ప్రచారం బాగా నడుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో గతంలో ప్రకాష్ రాజ్‌కు విభేధాలు ఉన్నాయి. ఇప్పుడు జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుంది. మరి ఇలాంటి సమయంలో ప్రకాశ్ రాజ్.. పవన్ పార్టీలో చేరతాడా అని అందరిలోనూ పలు అనుమానాలు ఉన్నాయి. నాగబాబు రెకమెండేషన్ తోనే జనసేన పార్టీలోకి ప్రకాష్ రాజ్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. వైసీపీ టార్గెట్‌గానే ప్రకాశ్ రాజ్ తెలుగు రాజకీయాలలోకి రాబోతున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది.