Posani : గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ యుద్ధం నడుస్తోంది. పోసాని చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆయనిని టార్గెట్ చేస్తూ ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నారని పోసాని వెల్లడిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించిన పోసానిపై పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించారని పోసాని ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే పవన్ అభిమానులు పోసాని ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని పోసాని వాచ్ మెన్ భార్య శోభ వెల్లడించింది. గత రాత్రి ఇద్దరు వ్యక్తులు ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని, వారిరువురు మాట్లాడుకున్న మాటలు వినిపించాయని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది. అయితే గత ఎనిమిది నెలల నుంచి పోసాని దంపతులు ఈ ఇంటిలో లేరని, వారు లేనప్పటికీ ఈ ఇంటి దగ్గర తామే ఉంటూ రాత్రి సమయంలో అక్కడే నిద్రిస్తున్నామని వాచ్ మెన్ భార్య తెలియజేసింది.
అయితే గత రెండు మూడు రోజుల నుంచి పోసానిని బూతులు తిడుతూ, ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో భయంతో తాము ఇంటి నుంచి బయటకు రాలేదని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది.