Pawan Kalyan : రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మళ్లీ రెండు స్థానాలనుండి పోటీ చేయనున్నారా.. అంటే.. అవుననే అంటున్నాయి పలు రాజకీయ వర్గాలు. ఆయన 2019 ఎలక్షన్లలో భీమవరం, గాజువాక ఇలా రెండు స్థానాల నుండి పోటీ చేయడం జరిగింది. కానీ రెండు చోట్లా ఓటమిని చవి చూశారు. ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలాగే రెండు నియోజక వర్గాలనుండి పోటీ చేసి ఒక స్థానంలో గెలుపొందారు.
అయితే రెండు స్థానాలనుండి పోటీ చేయడం అనేది ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ రెండు చోట్లా గెలిచినట్లయితే తమ నియోజక వర్గ పదవిని ఆ నాయకుడు వదిలి వేస్తాడని భావించే అవకాశం ఉండడం వలన రెండు స్థానాల్లో ప్రజలు ఓటు వేయకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అందు వలన రెండు చోట్లా ఓటమిని చూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తుంది.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇదే పద్దతిని మరొకసారి ఫాలో అవ్వనున్నారని తెలుస్తుంది. ఈసారి ఎన్నికలలో ఆయన ఉభయ గోదావరి జిల్లాల నుండి ఒక్కో నియోజక వర్గం చొప్పున రెండు స్థానాల నుండి పోటీ చేయనున్నారని సమాచారం అందుతుంది. ఈ రెండు జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తుంది. కొన్ని రాజకీయ వర్గాలు చెబుతున్న విధంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుండి అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట లేదా కాకినాడ నుండి పోటీ చేయనున్నట్టు విశ్వసిస్తున్నారు.
అయితే సదరు నియోజక వర్గాల్లో తెలుగు దేశం పార్టీ బలహీనంగా ఉండడంతోపాటు తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడం తనకు కలసి వస్తుందని పవన్ అభిప్రాయ పడుతున్నారని చెబుతున్నారు.