Pawan Kalyan : ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం సాధారణ విషయమే. ఈ రీమేక్ లే పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా నిలిపాయి. పవన్ కళ్యాణ్ ఓ సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే అది యాజ్- ఇట్- ఈజ్ గా ఉండదు. ఆయన అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు అందులో ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. పవన్ కెరీర్ లో 12 రీమేక్ సినిమాలే.. వాటిలో 9 సూపర్ హిట్లుగా నిలిచాయి. అవేంటో చూద్దాం..
పవన్ కళ్యాణ్, రాశి జంటగా నటించిన గోకులంలో సీత చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన గోకులతిల్ సీతై చిత్రానికి ఇది రీమేక్. పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన సుస్వాగతం మూవీని భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఓ క్లాసిక్ గా కూడా నిలిచింది.
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్-టైం-హిట్ అనిపించుకున్న ఖుషి కూడా రీమేకే..! దర్శకుడు ఎస్.జె.సూర్య మొదట ఈ చిత్రాన్ని తమిళంలో విజయ్ తో ఖుషి పేరుతోనే తెరకెక్కించాడు. పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన అన్నవరం చిత్రాన్ని కూడా భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ మూవీకి హరీష్ శంకర్ దర్శకుడు. పవన్ కళ్యాణ్ కు ఇది కం-బ్యాక్ మూవీ కావడం విశేషం. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల మల్టీస్టారర్ చిత్రానికి కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకుడు. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ఓ మై గాడ్ కు ఇది రీమేక్.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన కాటమ రాయుడు కు కూడా కిశోర్ పార్థసాని (డాలీ) నే దర్శకత్వం వహించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ వీరం చిత్రానికి ఇది రీమేక్. పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీని దిల్ రాజు నిర్మించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ కు రీమేక్ ఇది. పవన్ కళ్యాణ్- రానా లు హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే ను అందించారు. ఇలా పవన్ చేసిన వాటిల్లో పలు సినిమాలు హిట్ అయ్యాయి.