Pawan : రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ దుమ్ము రేపుతున్నాడు. రీసెంట్‌గా భీమ్లా నాయక్ చిత్రంతో పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీరామ నవమి సందర్భంగా హరిహర వీర మల్లు చిత్ర మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

హరిహర వీరమల్లు సినిమాలో పవన్ మూడు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దానికి అనుగుణంగా అతను 30 రకాల దుస్తులు ధరించి సరికొత్త లుక్‌లో కనిపించనున్నారట. హరి హర వీర మల్లులో అతను ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. క్రిష్ దర్శకత్వం వహించే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. మిగిలిన భాగాన్ని చిత్ర యూనిట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తోంది.
పీరియాడిక్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఈ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా పాత్రకు అనుగుణంగా తన మేక్ ఓవర్ ను పూర్తిగా మార్చేశాడు. మరోవైపు యుద్ధ విన్యాసాలతోనూ ఆకట్టకుంటున్నాడు. ఇప్పటికే సెట్ నుంచి విడుదలైన రిహార్సల్ ఫొటోలు, వీడియోలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అదిరిపోయే స్టంట్స్ తో పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తరువాత పవన్ తాను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ఇప్పుడు మరో రీమేక్ చిత్రంపై కన్నేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ చిత్రం వినోదయ సీతం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడట.