Om Raut : సంచలనాలు సృష్టిస్తుందనుకున్న ఆదిపురుష్ సినిమాకు టీజర్ విడుదల తరువాత ఊహించని షాక్ తగిలింది. సినిమాకు వ్యతిరేకంగా విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ప్రేక్షకులు టీజర్ చూసిన దగ్గర నుండి చిత్ర యూనిట్ ను, దర్శకుడిని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ సినిమాలోని పాత్రల గెటప్ లు, అందులోని గ్రాఫిక్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేయగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. అయితే ఇందులోని పాత్రలను తప్పుగా చిత్రీకరించారని, పురాణ పాత్రలను అవమాన పరుస్తున్నారని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో చేసిన సైఫ్ అలీ ఖాన్ ఆహార్యం మొఘల్ చక్రవర్తులను పోలి ఉందని చాలా మంది అంటున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఓం రౌత్ మీడియా ముందుకు వచ్చి ట్రోలింగ్ చేసే వారికి గట్టిగా సమాధానం చెప్పాడు.

ఓం రౌత్ ఇదివరకు దర్శకుడిగా అజయ్ దేవగణ్ తో తానాజీ అనే సినిమా చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ కు జవాబుగా ఆయన మాట్లాడుతూ.. తాము రావణుడి పాత్రను ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా తీర్చిదిద్దామని, సీతను అపహరించే అతనిలో కౄరత్వం, రాక్షసత్వం నిండి ఉంటాయని అన్నారు. తమ దృష్టిలో ఆదిపురుష్ ఒక సినిమా కాదని అది తమ ధర్మం ఇంకా బాధ్యత అని అన్నారు. ఇంకా ఆదిపురుష్ సినిమా తమ భక్తికి నిదర్శనం అని అలాగే తమకు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలని అన్నాడు. అయితే ఇప్పటికైనా సోషల్ మీడియాలో పాజిటివ్ స్పందన వస్తుందో రాదో అని చిత్ర యూనిట్ ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది.