NTR : నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సహాయాన్ని అందిస్తుంటాడు. నటనలోనూ.. దాతృత్వంలోనూ.. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు ఎన్టీఆర్. ఏ అభిమానికి ఆపద వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవుతుంటారు ఎన్టీఆర్. గతంలో ఎన్నోసార్లు తన అభిమానుల కోరికలను తీరుస్తూ.. వారికి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
తాజాగా ఎన్‌టీఆర్.. చావు బతుకుల మధ్య ఉన్న ఓ అభిమాని కోరిక తీర్చాడు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళీ ఎన్‌టీఆర్ వీరాభిమాని. ఇటీవల కొప్పడి మురళీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రెండు కిడ్నీలు పాడైపోయి ఇవాళో, రేపో అనే పరిస్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతను తనకు జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని ఉందని.. డాక్టర్‌కు పేపర్ రాసి ఇచ్చాడు.
మురళీ కోరిక తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కి ఈ విషయం చేరవేశారు. వెంటనే తన వీరాభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. అనంతరం డాక్టర్లు, కుటుంబసభ్యులను పలకరించి.. నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దామని ధైర్యం చెప్పారు ఎన్టీఆర్. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కూడా ఆకాంక్షించారు.
ఆ మధ్య ప్రభాస్ అభిమాని కూడా ఆయనతో మాట్లాడాలని ఉందని తెలియజేయగా, డాక్టర్స్ యంగ్ రెబల్‌స్టార్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. తనతో ప్రభాస్ మాట్లాడినందుకు ఆ అమ్మాయి ఎంతగా సంతోషపడిందో అలాంటి స్థితుల్లో ఆ అమ్మాయిని చూసినందుకు మాత్రం చాలా బాధపడ్డాడని ప్రభాస్ అన్నారు.