Google Search : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ భారతీయ యూజర్ల కోసం తాజాగా అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్ ద్వారా కోవిన్‌లో టీకాలు తీసుకునేందుకు స్లాట్ ను బుక్ చేసుకోవచ్చు. అలాగే వివిధ భారతీయ భాషలకు సంబంధించి దివ్యాంగుల కోసం టూల్స్‌ను ప్రవేశపెట్టింది. వాతావరణ విశేషాలపై మరింత మెరుగ్గా సమాచారం అందించనుంది.
గూగుల్ కొత్త అప్‌డేట్ ప్రకారం.. యూజర్లు 9 భారతీయ భాషల్లో గూగుల్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్‌కు స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్ అసిస్టెంట్ సహాయ పడుతుంది. ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు భాషల్లో యూజర్లు వ్యాక్సిన్ స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో అందిస్తారు.
గూగుల్‌లో యూజర్లు సెర్చ్ చేసే పదాలను గూగుల్ ఇకపై ఆటోమేటిగ్గా వారి మాతృభాషకు ట్రాన్స్‌లేట్ చేసి అందుకు తగిన విధంగా సెర్చ్ రిజల్ట్స్‌ను చూపిస్తుంది. అలాగే పలు భారతీయ భాషల్లో సెర్చ్ రిజల్ట్స్‌ను పెద్దగా చదవమని గూగుల్ సెర్చ్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చు. ఇవి దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇక గూగుల్ పేలోనూ పలు మార్పులను తెచ్చారు. ఇకపై హిందీ, ఇంగ్లిష్ కలగలిపి హింగ్లిష్‌లో యూజర్లు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే వాయిస్ కమాండ్ల ద్వారా ఇతరులకు డబ్బులు పంపుకునే వెసులుబాటును కల్పించారు.
గూగుల్ పేలోనే ఇంకో ఫీచర్‌ను అందించారు. బిల్ స్ప్లిట్ అని పిలవబడుతున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక బిల్లును పంచుకుని దాన్ని వారందరూ ఒకేసారి చెల్లించవచ్చు. అలాగే వాతావరణ విశేషాలు ఇకపై గూగుల్ సెర్చ్ లో మరింత మెరుగ్గా తెలుస్తాయి.
ముఖ్యంగా గూగుల్.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో భాగస్వామ్యం అయింది కనుక.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తెలుసుకోవచ్చు. అలాగే స్థానిక వాతావరణ విశేషాలు తెలుస్తాయి. వరదలు వచ్చే అవకాశం ఉంటే.. వెంటనే చెప్పేస్తుంది. ఇలా గూగుల్ సెర్చ్ పనిచేయనుంది. ఇందులో కొత్తగా రానున్న ఈ ఫీచర్లు యూజర్లకు ఎంతో సౌకర్యాన్ని అందివ్వనున్నాయి.