Nani : సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టిక్కెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోతో చాలా నష్టాలని చవిచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా థియేటర్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న రచ్చపై పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాలూ కొని తెచ్చుకునే కన్నా థియేటర్లు క్లోజ్ చేసుకోవడం మంచిదని భావిస్తున్నారు.
ఏపీలోని సినిమా టిక్కెట్ల రేట్లపై తాజాగా నాని స్పందించాడు. నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 24న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని ఏపీ టికెట్ రేట్ల విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. “ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు… మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు… ఈ పాలిటిక్స్ ను, సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్టే అని ఆయన అన్నారు.
టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని… మళ్ళీ ఇది అనవసరంగా ఏ థంబ్ నెయిల్స్ పెడతారో… రేపు అసలు సినిమా రిలీజ్ కూడా ఉంది. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు. నా చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం. ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అయితే అదే సమయంలో అందరూ రూ.100 ఇవ్వగలరు. నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే…” అంటూ నాని కామెంట్స్ చేయగా ఇది హాట్ టాపిక్‌గా మారింది.