Nani : నేచురల్ స్టార్ నాని వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం మంచి హిట్ కావడంతో ఇప్పుడు తదుపరి చిత్రం.. అంటే సుందరానికి మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజైన విషయం తెలిసిందే.

టీజర్ రిలీజ్ సందర్భంగా ఓ ఈవెంట్‌ని నిర్వహించగా, ఈవెంట్ లో నాని పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మీ నుంచి పాన్ ఇండియా సినిమా ఎప్పుడు అని ప్రశ్నించగా, దానికి సమాధానం ఇచ్చిన నాని.. పాన్ ఇండియా అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పడు దేశమంతా మంచి పేరొస్తే.. ఎక్కడెక్కడో వున్న వాళ్లంతా మన తెలుగు సినిమాని చూసి.. ఫోన్ చేసి చాలా బాగుందంటే అది పాన్ ఇండియా కిందే లెక్క. అని చెప్పుకొచ్చాడు.
ఇక తెలుగు, తమిళ్, మళయాళంలోనే.. అంటే సుందరానికి మూవీని రిలీజ్ చేస్తున్నారు, కన్నడ లో ఎందుకు రిలీజ్ చేయడం లేదు అన్న ప్రశ్నకు స్పందించిన నాని.. చాలా మంది కన్నడ ప్రజలు తెలుగును అర్థం చేసుకుంటారని, తెలుగు చిత్రాలను చూడటానికి ఇష్టపడతారని అన్నారు. మిగతా వాళ్లు అలా కాదు అని అన్నారు. అయితే నాని వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు హర్ట్ అయ్యారు. నానిని ట్యాగ్ చేస్తూ కన్నడ ప్రేక్షకులు చూడాలనుకుంటే, కన్నడలోకి కూడా డబ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన నాని డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్‌లో నేను చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్ప్పలేకపోయినందుకు సారీ.. బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్ కు గర్వపడుతున్నా అని నాని ట్వీట్ చేశారు.