Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. తన సోదరుడు పవన్‌కు చెందిన జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఆయన జనసేన పార్టీకి చెందిన మహిళలతో సమావేశం అయ్యారు. అయితే తాను ముందుగా ఏమీ అనుకోలేదని చెప్పిన నాగబాబు.. మహిళల వస్త్రధారణపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మహిళలు దుస్తులు ధరించే విధానంపై మగవాళ్లు ఫిర్యాదు చేయడం మానుకోవాలని అన్నారు.
అప్పట్లో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మహిళల దుస్తులపై కామెంట్లు చేశారు. హీరోయిన్లు కేవలం సినిమా అవకాశాలను పొందడం కోసమే అసభ్యకరమైన దుస్తులను ధరిస్తున్నారని.. కాస్త పద్ధతిగా దుస్తులను ధరిస్తే తప్పేమిటి.. అని ప్రశ్నించారు. అయితే ఆయన కామెంట్లపై అప్పట్లో నాగబాబు విమర్శించారు. అయితే అదే సంఘటనను నాగబాబు తాజాగా జనసేన మహిళలతో జరిగిన మీటింగ్‌లో గుర్తు చేశారు. అప్పట్లో ఓ ఇద్దరు పెద్ద మనుషులు మహిళల దుస్తులపై కామెంట్స్ చేశారని.. అయితే వారి పేర్లను ఇప్పుడు చెప్పేందుకు తాను ఇష్టపడడం లేదని.. కానీ వారు మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ అయితే తప్పని అన్నారు.

మహిళలు ఎలాంటి దుస్తులను ధరించాలో అది వారి నిర్ణయమని.. ఆ విషయంలో వారిని ప్రశ్నించే హక్కు మగవాళ్లకు లేదని నాగబాబు అన్నారు. తాను ఇంట్లో తల్లి వద్ద పెరిగానని.. కనుక మహిళలు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. తాను తన కొడుకు కన్నా కుమార్తెకే అధిక ప్రాధాన్యతను ఇస్తానని తెలిపారు. అలాగే మహిళలను చూస్తే ముఖం చూడాలి.. లేదా పాదాలను చూడాలి.. అంతేకానీ.. శరీరం మొత్తాన్ని చూడకూడదని.. అలా చూసే హక్కు మగవాళ్లకు లేదన్నారు. కాగా నాగబాబు కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.