Nag Ashwin : నాగ్ అశ్విన్ మంచి టాలెంట్ ఉన్న టాలీవుడ్ దర్శకులలో ఒకరు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి లాంటి చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నాడు. ప్రియాంక దత్ భర్తగా, టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ కి అల్లుడిగా కూడా చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈయన ప్రాజెక్ట్ కె పేరుతో దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనెలతోపాటు అమితాబ్ బచ్చన్ లాంటివారు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
అయితే ఇంత ప్రతిష్టాత్మంకంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికి వరకు ఎటువంటి అప్ డేట్ గానీ ప్రకటనగానీ రాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రానికి చెందిన ఎటువంటి సమాచారం బయటికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారని టాక్ నడుస్తుంది. కానీ ఈ పద్దతి సినిమాకు మంచిది కాదని, ఇలా సీక్రెట్ గా ఉంచడం వలన ఆదిపురుష్ విషయంలో జరిగినట్టుగా ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందని అంటున్నారు.
ఆది పురుష్ సినిమాను కూడా ఇదే విధంగా గొప్ప కళా ఖండం తీస్తున్నామని ఊహించుకొని టీజర్ విడుదల అయ్యేంత వరకు అన్ని విషయాలు రహస్యంగా ఉంచడం జరిగింది. ఎటువంటి పోస్టర్లు గానీ, గెటప్ లు గానీ ముందుగా చూపించలేదు. ఒక్కసారిగా టీజర్ వదలడంతో అందరూ షాక్ కు గురయ్యారు. దానిలోని పాత్రలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా మందికి ఏ మాత్రం నచ్చలేదు. దాంతో ఆది పురుష్ ను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ కె మూవీకి సంబంధించి ప్రకటనలు, పోస్టర్లు, మేకింగ్ సీన్లు, గెటప్ లు చూపించాలని నాగ్ అశ్విన్ కు కొందరు సూచిస్తున్నారు. కనీసం ఏవైనా అప్ డేట్ లు అయినా ఇవ్వాలని చెబుతున్నారు. దాని వలన సినిమా నుండి ఏం ఆశించాలో ప్రేక్షకులకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారి స్పందనను బట్టి సినిమాలో ఏవైనా మార్పులు చేయడానికి కూడా వీలవుతుందని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజీఎఫ్ చిత్రాలకు కూడా ఎప్పటికప్పుడు క్యారెక్టర్లను, పోస్టర్లను విడుదల చేశారని గుర్తు చేస్తున్నారు.
ప్రాజెక్ట్ కె టీమ్ కూడా ఇప్పటికైనా మేల్కొని సినిమా కథకు సంబంధించి కానీ, క్యారెక్టర్లకు సంబంధించి కానీ ప్రకటన చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రేక్షకులకు సినిమాకు మధ్య పారదర్శకత పెరిగి సినిమా విజయానికి దోహదం చేస్తుందని సలహా ఇస్తున్నారు. లేకపోతే ఆది పురుష్ ఎదుర్కున్న పరిస్థితులనే చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.