Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 11 మంది గెలిచినప్పటికీ రాజీనామాలు చేసిన విషయం విదితమే. అలాగే ప్రకాష్ రాజ్, నాగబాబులు తమ మా మెంబర్‌షిప్‌కు కూడా రాజీనామా చేశారు. అయితే రాజీనామాలను ఆమోదించబోనని గతంలో మంచు విష్ణు స్పష్టం చేశారు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేసినా తమకు మాత్రం ఇంకా రాజీనామాలు అందలేదని, అవి అందాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమ గెలుపు తన ఒక్కడిది కాదని, ప్యానెల్ అందరమూ కష్టపడి గెలిచామని, అందువల్ల ఇది అందరి విజయమని మంచు విష్ణు అన్నారు. తిరుపతిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యులు మాట్లాడారు.
ఇక తాము ప్రజాస్వామయుతంగా గెలిచామని మంచు విష్ణు అన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చని ఉద్ఘాటించారు. ఈసారి తాము గెలిచామని, తరువాత ఇంకా ఎవరైనా గెలవొచ్చని అన్నారు. బాబూ మోహన్ మాట్లాడుతూ.. తమ గెలుపును ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
అయితే రాజీనామాలు.. అంటూ డ్రామాలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులపై కొందరు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు అంతర్గతంగా ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు రాజీనామాలు పంపకుండా తాత్సారం చేయడం వెనుక అనేక సందేహాలు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. రాజీనామా చేసే ఉద్దేశం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి అంత హడావిడి చేయడం ఎందుకని.. చర్చించుకుంటున్నారు. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఏమంటారో చూడాలి.