Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు మంచు తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచితే.. ఏపీలో తగ్గించారని, కానీ రెండు రాష్ట్రాల్లోనూ దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని అన్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని విష్ణు అన్నారు. ఈ క్రమంలోనే చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం ప్రకారం తాము ఈ విషయంపై ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, అయితే సీఎం జగన్‌ను చిరంజీవి పర్సనల్ పనుల కోసం కలిసి ఉంటారని, ఆయన సమావేశం సినిమా ఇండస్ట్రీ కోసం అయి ఉండే అవకాశం లేదన్నారు.
సినీ ఇండస్ట్రీ అంతా ఓ పెద్ద కుటుంబమని మంచు విష్ణు అన్నారు. టిక్కెట్ల ధరలను పెంచాలా, తగ్గించాలా.. అనే విషయం ఎన్నో సంవత్సరాల నుంచి చర్చకు వస్తుందని.. అయితే అది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని అన్నారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తోపాటు ఫిలిం చాంబర్‌తో టచ్‌లో ఉన్నామని.. అందరం కలసి ముందుకు సాగుతామని అన్నారు. తాను ఒక్కడినే ఈ విషయంపై మాట్లాడడం సరికాదని.. దీంతో సమస్య పక్కదారి పట్టేందుకు అవకాశాలు ఉంటాయన్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదని, అది అందరికీ చెందుతుందని విష్ణు అన్నారు. సొంత లాభం కోసం ఎవరు హద్దులు మీరి ప్రవర్తించకూడదని, ఆవేశంతో మాట్లాడకూడదని, అది ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డ పేరు తెస్తుందని అన్నారు. ఇక ఇండస్ట్రీలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందని, తన అభిప్రాయాలు కూడా తనకు ఉంటాయని అన్నారు. తాను ఏది మాట్లాడినా దాన్ని అసోసియేషన్ తరఫున మాట్లాడినట్లు చూడకూడదని అన్నారు. రెండు ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే మా అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై మీడియాతో మాట్లాడుతానని విష్ణు తెలిపారు. ఇక సినిమా టిక్కెట్లపై జీవో వైఎస్సార్ హయాంలోనే వచ్చిందని.. దానిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇక చిరంజీవి ఇండస్ట్రీలో పలువురిని కలవబోతున్నారనే విషయంపై కూడా విష్ణు మాట్లాడారు. అది అందరికీ మంచిదే కదా.. అని అన్నారు.
కాగా మంగళవారం చిరంజీవి పలువురు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. సీఎం జగన్‌తో ఇటీవల ఆయన సమావేశమయ్యారు కనుక ఆ వివరాలను వారితో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే చిరంజీవి టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు ఒక్క రోజు ముందు విష్ణు ఈ విధంగా కామెంట్స్ చేయడం.. సంచలనంగా మారింది.