Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాజమౌళి త్వరలో మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా రూ.800 కోట్లతో భారీగా రూపొందించనున్నారట. ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని, RRR, బాహుబలి కంటే పెద్దదిగా ఉండబోతోందని టాక్స్ వినిపించాయి. అయితే ఈ విషయాలపై రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.

మహేష్ – రాజమౌళి సినిమా రూ.800 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడుతుందనే పుకార్లలో నిజం ఉందా.. అని విజయేంద్ర ప్రసాద్‌ను అడగగా, విజయేంద్ర ప్రసాద్ కాస్త వెటకారంగా నవ్వుతూ కొట్టి పారేశారు. కథ లేకుండా రూ.800కోట్ల బడ్జెట్ ఎక్కడిది అని ప్రశ్నించారు. ఈ ఏడాది చివరికల్లా రాజమౌళి కథను ఖరారు చేసి, ఈ క్యాలెండర్ ఇయర్‌లో సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. జంగిల్ అడ్వెంచర్ చిత్రంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి, కె విజయేంద్ర ప్రసాద్‌లు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్ సరసన హిందీ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి RRRలో సీత పాత్రలో నటించిన ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. ఆ మేరకు ఆలియా భట్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.