Maa Elections : అక్టోబర్ 10వ తేదీ జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి ప్యానెల్ సభ్యుల గురించి మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నరేష్ ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన ఆరోపించారు.
అక్టోబర్ 10వ తేదీన ప్రకాష్ రాజ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు.. అంటూ విమర్శలు చేయడం సరికాదని నాగబాబు పేర్కొన్నారు. మొదటినుంచి లోకల్, నాన్ లోకల్ అన్న భావన లేదని.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పిందే నరేష్ అని.. ఇప్పుడు మాత్రం పోటీ చేయడానికి తెలుగు వాళ్ళు లేరా అని అనడం ఏమాత్రం సరికాదని అన్నారు. ప్రకాష్ రాజు స్థానికుడు కాదని ఎన్నిసార్లు అంటారు.. అతను స్థానికుడు కాకపోతే అతనికి మెంబర్‌షిప్ ఎందుకు ఇచ్చారు ? అంటూ ప్రశ్నించారు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మేమందరం కూడా ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ మీరెందుకు ఇక్కడ ఉన్నారని.. అనలేదని.. ఈ సందర్భంగా నాగ బాబు గుర్తు చేశారు.