Lord Ganesha : సాధారణంగా ఒక జంటకు పెళ్లి నిర్వహించాలంటే ఇరు కుటుంబాల సభ్యులు పలు విషయాల గురించి చర్చించుకుని వధూవరుల కుటుంబాల గురించి బాగా విచారణ చేసిన తర్వాతనే పెళ్లిళ్లు నిర్ణయించడం జరుగుతుంది. కానీ కర్ణాటకలో ఉన్న హెన్నావర సమీపంలోని ఇడగుంజిలో మాత్రం ఎవరైనా వివాహం చేసుకోవాలంటే ఆ ఊరి ఆలయంలో వెలసిన వినాయకుడి నిర్ణయం తప్పని సరిగా తీసుకుంటారు. ఇక్కడ ఏ వధూవరులకు పెళ్లి జరగాలన్నా తప్పకుండా ఆ పెళ్లిని వినాయకుడు నిర్ణయించిన తరువాతనే చేస్తారు. ఈ గ్రామంలో వెలసిన వినాయకుడు పెళ్లిళ్లను నిశ్చయం చేస్తాడు కనుక ఈ వినాయకుడికి పెళ్లిళ్లను ఖాయం చేసే వినాయకుడు అనే పేరు వచ్చింది.
సాధారణంగా మనం ఏ వినాయకుడి ఆలయానికి వెళ్లినా స్వామి వారు కూర్చుని ఏకదంతంతో మనకు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు నిలబడి రెండు దంతాలు, రెండు చేతులు కలిగి ఎలుక వాహనం లేకుండా మనకు కనిపిస్తాడు. ఇక ఈ గ్రామంలో ఎవరికైనా పెళ్లి నిశ్చయం అయితే ముందుగా వరుడి కుటుంబ సభ్యులు, వధువు కుటుంబ సభ్యులు కలిసి ఈ ఆలయానికి వెళ్లి వారి పేర్లను పేపర్ పై రాసి స్వామి వారి పాదాల దగ్గర పెడతారు.
ఈ విధంగా కుడిపాదం దగ్గర పెట్టిన పేపర్ (చిట్టి) కింద పడితే తప్పనిసరిగా ఆ జంటకు వివాహం చేస్తారు. అలా కాకుండా ఉంటే ఇక ఆ సంబంధం గురించి ఏమాత్రం ఆలోచించక పెళ్లి వారు మరొక సంబంధం కోసం వెతకాల్సి ఉంటుంది. అందుకే ఇలా ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇలా స్వామివారి నిర్ణయం తీసుకుని పెళ్లి చేస్తారు. అందుకే ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని పెళ్లి చేసే వినాయకుడిగా భక్తులు పూజిస్తారు.