Krithi Shetty : వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించి అందరి మనసులను గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. క్యూట్ స‍్మయిల్‌తో.. చక్కని అందం.. అభినయంతోనూ జనాల్ని కట్టిపడేసింది. తెలుగులో స్పష్టంగా, చాలా చక్కగా మాట్లాడేస్తూ.. టాలీవుడ్‌లో ఇంత తక్కువ కాలంలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది.. ఈ ముద్దుగుమ్మ.
కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న క్రేజీ ఫిలిం ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రంలో చైతూతో జోడీ కట్టింది కృతి. తాజాగా ‘బంగార్రాజు’ లో నాగలక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్న కృతి శెట్టి లుక్ వదిలారు. ‘ఉప్పెన’ లో క్యూట్ లుక్‌తో ఆకట్టుకున్న కృతి.. నాగలక్ష్మీ గెటప్‌లో చూడముచ్చటగా ఉంది.
ఈ అమ్మడిని చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుందా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు కింగ్ నాగార్జున. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే కృతికి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.