Kantara Movie : కేజీఎఫ్ 2, 777 చార్లీ, విక్రాంత్ రోణా ఈ మధ్య కాలంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటిన సినిమాలు. ఇదే వరుసలో రీసెంట్ గా విడుదలైన కంతారా అనే మరో కన్నడ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు ఏర్పడుతున్న విపరీతమైన క్రేజ్ తో వివిధ భాషల్లోకి డబ్ చేస్తూ షోలను కూడా పెంచవలసి వస్తోంది. సినిమాలకు రేటింగ్ లు ఇచ్చే వేదిక ఐఎమ్‌డీబిలో 9.6 తో అత్యధిక రేటింగ్ ను కంతారా చిత్రం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగులోకి కూడా అనువాదం కానుంది.
కేజీఎఫ్ చిత్రాలతో ఫేమస్ అయిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన కంతారా సినిమాకు రిషబ్ శెట్టి రచన ఇంకా దర్శకత్వం చేశాడు. తనే ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. గత నెల కన్నడ భాషలో విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. దాంతో హోంబలే నిర్మాణ సంస్థ దీనిని ఇతర భాషల్లోకి అనువాదం చేయడానికి నిర్ణయించింది. ఈ క్రమంలోనే తెలుగులో విడుదల చేయడానికి పంపిణీ హక్కులను గీతా ఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది.

ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ ఈ విషయం గురించి ట్విట్టర్ లో షేర్ చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అక్టోబర్ 15 నుండి థియేటర్లలో కంతారా సినిమాను తెలుగులో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, నవీన్ డి పడ్లీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విడుదలైన రోజునుండి సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.