సీనియర్ ఎన్‌టీఆర్ మనవడిగా, హరికృష్ణ కుమారుడిగా జూనియర్ ఎన్‌టీఆర్ సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తన డ్యాన్స్, నటన, మంచి గుణం లాంటి అంశాలతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నందమూరి వంశం నుంచి అనేక మంది వచ్చి హీరోలుగా తమ అదృష్టాలను పరీక్షించుకున్నారు. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సొంత టాలెంట్, కాస్త లక్ కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తారు. జూనియర్ ఎన్‌టీఆర్ విషయంలోనూ ఇలాగే జరిగిందని చెప్పవచ్చు.
జూనియర్ ఎన్‌టీఆర్ మొదట్లో చాలా లావుగా ఉండేవాడు. కానీ డ్యాన్స్, నటన మాత్రం అద్భుతం. అయితే మొదట్లో ఇతను హీరోనా అని గేలి చేశారు. కానీ నటన, డ్యాన్స్‌తో విమర్శకుల నోళ్లను సైతం మూయించాడు. రాను రాను జూనియర్ ఎన్‌టీఆర్‌లోని అసలైన నటుడు బయటకు వచ్చాడు. దీంతో ఆయన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అరవింద సమేతలో ఫ్యాక్షన్ పాత్రలో భీభత్సతం సృష్టిస్తే.. ఆర్ఆర్ఆర్‌లో గోండు జాతి బిడ్డగా నటన అదరగొట్టేశాడు. ఇలా జూనియర్ ఎన్‌టీఆర్ ఎప్పటికప్పుడు నటనలో పరిణతి సాధిస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్‌టీఆర్ కన్నడలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
సాధారణంగా ఇతర భాషలను నేర్చుకుని స్టేజిపై అనర్గళంగా మాట్లాడడం అంటే.. అది ఆషామాషీ విషయం కాదు. కానీ జూనియర్ ఎన్‌టీఆర్ మాత్రం ఏమాత్రం తడబడకుండా కన్నడలో మాట్లాడాడు. దీంతో ఆయన స్పీచ్‌కు కన్నడిగులు సైతం ఫిదా అయ్యారు. ఎన్‌టీఆర్ మావాడే అని వారు కితాబిస్తున్నారు. అయితే వారు తెలియక చేసినా కానీ.. వాస్తవానికి ఎన్‌టీఆర్ మూలాలు కర్ణాటకలోనే ఉన్నాయి. అవును.. ఎన్‌టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందినవారు. ఆమె మంగళూరులోని కుందపుర అనే ప్రాంతంలో జన్మించారు.
అయితే షాలిని హైదరాబాద్‌కు వలస వచ్చి మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో హరికృష్ణతో ప్రేమలో పడ్డారు. తరువాత వివాహం జరిగింది. చాలా కాలం వరకు జూనియర్ ఎన్‌టీఆర్ ను నందమూరి వారసుడిగా ఆయన వంశీయులు అంగీకరించలేదు. కానీ తరువాత అంగీకరించారు. అయితే ఈ విషయం ప్రస్తుతానికి అవసరం లేదు. కానీ జూనియర్ ఎన్‌టీఆర్ గురించి కన్నడిగులకు ఇప్పుడు తెలిసిపోయింది. కనుక ఎన్‌టీఆర్ మావాడే అని వారు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఎన్‌టీఆర్ సినిమా కూడా తీస్తుండడం విశేషం. మరి ఆ మూవీ విడుదల అయితే కర్ణాటకలో జూనియర్ ఎన్‌టీఆర్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఏమైనా.. కన్నడిగులు ఇలా జూనియర్ ఎన్‌టీఆర్ ను తమ వాడిగా చెప్పుకోవడం కొత్త చర్చకు దారి తీసిందని భావించవచ్చు.