Jio 5G Phone : కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ కాబోతోంది. తాజాగా ప్రముఖ నెట్ వర్క్ సంస్థ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జియో ఫోన్లను మార్కెట్లోకి తీసుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక గతేడాది జియో ఫోన్ నెక్ట్స్‌ను వినియోగదారులకు ముందుకు తెచ్చింది. కేవలం రూ.5 వేలకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించింది.
ఇక తాజాగా 5జీ ఫోన్ తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే దసరా కానుకగా కానీ.. ఈ ఏడాది చివరి నాటికి కానీ జియో 5జి ఫోన్ మార్కెట్‌లోకి రానున్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో.. ధర ఎంత ఉంటుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జియో 5జి ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ ప్లే ఉండనుందని సమాచారం. స్నాప్ డ్రాగన్ 480 5జి ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని జియో వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, జియో కలిపి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తోనే ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్ ఉండనుంది. ఈ ఫోన్ లో బ్యాక్ కెమెరా13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. జియో 5జి ఫోన్ 5 రకాల 5జి బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఫోన్ వెనుక భాగంలో గానీ.. సైడ్‌లో గానీ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెంట్, గూగుల్ లెన్స్, ట్రాన్స్‌లేట్ లాంటి గూగుల్ యాప్స్ ఉండనున్నాయి.
వీటితోపాటు మై జియో, జియో టీవీ ఉంటాయి. ఇతర జియో యాప్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్టుగా ఉండనుంది. డ్యుయల్ సిమ్, మెమొరీ కార్డు ఆప్షన్ ఉండనుందని తెలుస్తోంది. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జియో 5జీ ఫోన్‌ను రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య విక్రయించే అవకాశం ఉంది. జియో ఫోన్ నెక్ట్స్ తరహాలోనే వీటిని విక్రయించనున్నట్లు సమాచారం. కేవలం రూ.2,500 చెల్లించి 5జి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈఎంఐ రూపంలో నగదు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. జియో 5జి మొబైల్ తో మరో టెక్ విప్లవానికి నాంది పలకనుంది. ఈ మొబైల్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.