Janhvi Kapoor : అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి తరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే తల్లికి తగ్గ తనయగా జాన్వీ కపూర్ కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అందులో భాగంగానే ఈమె ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈమెకు ఒక్క హిట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ నటిగా ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మంచి హిట్ కోసం ఈమె ఎదురు చూస్తోంది. ఇక టాలీవుడ్‌కు కూడా ఈమె అదిగో.. ఇదిగో పరిచయం అవుతుంది.. అంటూ ఇప్పటికే అనేక సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయింది. అయితే ఈసారి మాత్రం జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీపై సాలిడ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత కొరటాల శివ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో జాన్వీకపూర్‌ను ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. గతంలోనూ బోనీకపూర్ ఈ విషయంపై చెప్పారు. ఎన్టీఆర్ తో కలిసి జాన్వీకపూర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయాలని శ్రీదేవి కోరిందట. దీంతో బోనీ కపూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్‌టీఆర్‌తో ఈమె నటించబోతుందని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ, బన్నీ లాంటి హీరోల సినిమాల్లో జాన్వీ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్‌టీఆర్ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుందని బోనీ కపూర్ చెప్పారు. ఇక ఆ సమయం రానే వచ్చింది.

మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా జాన్వీ కపూర్ ను ఎన్టీఆర్‌తో నటింపజేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. అయితే తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తానని ఇప్పటికే జాన్వీ కపూర్ షరతు పెట్టింది. మరి ఆమెను ఒప్పించగలిగే కథను కొరటాల చెబుతారా.. ఆమె తన తల్లి కోరక మేరకు ఎన్‌టీఆర్ పక్కన నటించి తెలుగు తెరకు పరిచయం అవుతుందా.. అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.