IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచనుంది. తాజాగా బీసీసీఐ రెండు కొత్త టీమ్‌లను ప్రకటించిన విషయం విదితమే. లక్నో, అహ్మదాబాద్ టీమ్‌లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో వచ్చే సీజన్ నుంచి 10 జట్లు ఐపీఎల్ ఆడుతాయి. అయితే గతంలోనూ 10 జట్లు ఉన్నప్పుడు ఫార్మాట్‌ను మార్చారు. కానీ 8 జట్లు అవడంతో యథావిధిగా రొటీన్ ఫార్మాట్‌నే అనుసరించారు. అయితే ఇకపై మళ్లీ 10 జట్లు ఆడనుండడంతో ఫార్మాట్ ను మార్చారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 జట్లు కింద తెలిపిన ఫార్మాట్‌లో మ్యాచ్‌లను ఆడనున్నాయి.
10 జట్లను రెండు రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు ఉంటాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని అన్ని టీమ్‌లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. ఒకటి హోమ్, ఒకటి ఎవే పద్ధతిలో మ్యాచ్‌లను ఆడుతారు.
ఇక ఒక టీమ్ ఇంకో గ్రూప్‌లో ఉన్న 4 టీమ్‌లతో సింగిల్ గేమ్‌ను ఆడుతుంది. అది హోమ్ లేదా ఎవే ఏదైనా అయి ఉండవచ్చు. ఇక అదే టీమ్ ఇంకో గ్రూప్‌లో ఉన్న ఒక టీమ్‌తో రెండు మ్యాచ్‌లను ఆడుతుంది. ఇవి ఒకటి హోమ్, ఒకటి ఎవే లో జరుగుతాయి. ఈ క్రమంలో ఈ ఫార్మాట్ ప్రకారం మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. కానీ ఒక టీమ్ మాత్రం లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లను ఆడుతుంది.
ఇక పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల్లో ఉండే జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయి. తరువాత ప్లే ఆఫ్స్, ఫైనల్ జరుగుతాయి. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్‌కు గాను డిసెంబర్ లేదా జనవరి లేదా ఫిబ్రవరిలో మెగా వేలం ఉంటుందని తెలుస్తోంది.