IPL 2022 : ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 టోర్నీ 32వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ చాలా అలవోకగా ఛేదించింది. ఇంకా సగం బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ మ్యాచ్‌ను ముగించింది. పంజాబ్ బౌలర్లను ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఉతికి ఆరేశారు. తమ టీమ్ కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే పంజాబ్‌పై ఢిల్లీ 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో జితేష్ శర్మ ఒక్కడే 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా 2 వికెట్లు చొప్పున తీశారు. ముస్తాఫిజుర్ రహమాన్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడింది. పరుగుల మోత మోగించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఢిల్లీ 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లలో డేవిడ్ వార్నర్ 30 బంతుల్లోనే 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్ల నుంచి పరుగులను పిండుకున్నాడు. అలాగే ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా సైతం ఆకట్టుకున్నాడు. 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్‌కు 1 వికెట్ దక్కింది.