Instant Sambar : వెజ్, నాన్ వెజ్ వేపుడు కూరలను సాంబార్ తో కలిపి తింటే ఆహా దాని రుచి అదిరిపోతుంది. కొందరైతే ఫంక్షన్స్ లో ఎన్ని రకాలు వంటకాలు ముందు ఉన్న కూడా సాంబార్ ఎక్కడ అని అడగడం మొదలు పెడతారు. కాని అదే సాంబార్ ని ఇంట్లో తయారు చేసుకోవాలంటే కొంచెం పెద్ద పనిగా భావిస్తారు. ఇప్పుడు మేము చెప్పే విధంగా చేస్తే జస్ట్ పది నిమిషాల్లో రుచికరమైన సాంబార్ తయారైపోతుంది. అబ్బా ఇంత సులభంగా ఎలా అనుకుంటున్నారా. దీనినే ఇన్‌స్టంట్ సాంబార్ అంటారు. మనం మామూలుగా సాంబార్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ అలా కాకుండా సాంబార్ చాలా ఫాస్ట్ గా కావాలంటే మన ముందుగానే సాంబార్ పొడి తయారు చేసి పెట్టుకోవాలి. ఈ ఇన్‌స్టంట్ సాంబార్ ని ఎలా తయారు చేసుకోవాలి. తయారీకి కావలిసిన పదార్థాలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌స్టంట్ సాంబార్ కోసం పొడిని తయారు చేసుకునే విధానం :
ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో దానిపైన ఒక మందపాటి కళాయిని పెట్టుకోండి. అందులో 1 కప్పు కందిపప్పు, ఒక 1/2 కప్పు పెసరపప్పును వేసి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. కందిపప్పు, పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో 2 టీ స్పూన్స్ ధనియాలు, 3 లవంగాలు, 2 యాలకులు, 10-12 మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాయి మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 10 నుండి 15 ఎండు మిర్చి కూడా వేసి బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకునేవారు 20 నుండి 30 ఎండుమిర్చి తీసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 3 రెబ్బల కరివేపాకు ఆకులను తీసుకుని తడిి లేకుండా డ్రై అయ్యేంత వరకూ వేయించుకోవాలి.

ఇప్పుడు వేయించుకున్న ఇంగ్రీడెంట్స్ అన్నింటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో ఒక పిడికెడు చింతపండును కలపండి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయండి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసుకుని భద్రపరుచుకోండి. ఇలా ఈ పొడిని రెండు నుంచి మూడు నెలల వరకు వాడుకోవచ్చు.
ఇప్పుడు ఇన్‌స్టంట్ సాంబార్ ని తయారు చేసుకునే విధానం :
కళాయిలో ఐదారు స్పూన్లు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్ల పోపు దినుసులు, ఒక రెబ్బ కరివేపాకు, అర టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, 5 చిన్న చిన్న ఉల్లిపాయలు, ఒక కప్పు సొరకాయ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, పది ములక్కాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో కూరగాయ ముక్కలన్నీ మగ్గే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలో ఒక లీటర్ వరకు నీరు పోసుకోవాలి. నీరు కొంచెం మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న సాంబార్ పొడిని ఐదు ఆరు స్పూన్ల వరకు నీటిలో కలుపుకోవాలి. ఇలా ఒక పది నిమిషాలు మరిగించిన తర్వాత చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కనుక సాంబార్ ప్రిపేర్ చేస్తే రుచికరమైన చిక్కటి సాంబార్ రెడీ అయినట్లే.. ఫైనల్ గా ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి.