భారత్‌లో తయారు చేయబడిన రెండు కోవిడ్ వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్ సురక్షితమేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎవరికైనా ఇన్‌ఫెక్షన్ సోకితే వారు హాస్పిటల్‌లో చికిత్స తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. కోవిడ్ మొదటి డోసు తీసుకున్న అధికారులెవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని తెలిపారు.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండూ సురక్షితమేనని, కోవిడ్ నుంచి రక్షణను అందిస్తాయని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ పట్ల ఇంకా ఎవరికైనా సందేహాలు, అనుమానాలు ఉంటే వారు వాట్సాప్‌లో ప్రచారం అయ్యే ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కోవిడ్ బారిన పడ్డ కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ బారిన పడితే వారు ఐసీయూలో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. రెండో డోసు తీసుకున్న అనంతరం కూడా 2 వారాల వరకు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఇప్పటికే మొత్తం 6 కోట్ల డోసులను ఇచ్చామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు సరిపోయిన మేర కోవిడ్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని చోట్ల ఎక్కువగా గుమి గూడుతుండడం, కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ప్రజలు కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని, వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకోవాలని ఆయన సూచించారు.