ఆవు మూత్రంలో ఔషధ గుణాలు ఉంటాయని ఆయర్వేదం చెబుతోంది. దీన్ని కొందరు సైంటిస్టులు నిరూపించారు కూడా. పలు ఔషధాల తయారీలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు. అయితే ఆవు మూత్రం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు నయం అయ్యే మాట ఆయుర్వేదం ప్రకారం నిజమే అయినప్పటికీ కరోనా వైరస్ తగ్గుతుందని ఎక్కడా చెప్పలేదు. ఈ దిశగా ఎవరూ ప్రయోగాలు కూడా చేయలేదు. కానీ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఆవు మూత్రం తాగితే కరోనా రాకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బైరియా ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవాలంటే ఆవు మూత్రం తాగాలని చెప్పారు. అంతేకాదు ఆయన కెమెరా ఎదుట ఆవు మూత్రం తాగి చూపించారు. కరోనా రాకుండా ఉండాలంటే ఆవు మూత్రాన్ని రోజూ రెండు, మూడు గుక్కల చొప్పున నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగాలని సూచించారు. ఆవు మూత్రం తాగాక 30 నిమిషాల పాటు ఏమీ తీసుకోకూడదని అన్నారు.
https://youtu.be/ONLk_v3inOw
అయితే ఆవు మూత్రం తాగితే కరోనా వస్తుందో, రాదో చెప్పలేము కానీ ఉత్తరప్రదేశ్‌లో రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే అక్కడ కొత్తగా 28,076 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 372 మంది చనిపోయారు. మొత్తం 14,53,679 మందికి కరోనా సోకగా, 14,873 మంది చనిపోయారు.