Hero Vida V1 Plus : ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తి దారు హీరో మోటోకార్ప్ కొత్తగా విడా వి1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. విడా వి1 ప్లస్, విడా వి1 ప్రొ పేరిట ఈ స్కూటర్స్ విడుదలయ్యాయి. వీటిల్లో వరుసగా 3.44, 3.94 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన బ్యాటరీలను అందిస్తున్నారు. కాగా ప్లస్ మోడల్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 143 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. అదే ప్రొ మోడల్ అయితే ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఏకంగా 165 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక ఈ స్కూటర్లను హీరో మోటోకార్ప్ సంస్థ అత్యాధునిక సదుపాయాలతో అందిస్తున్నట్లు తెలియజేసింది.
ఈ స్కూటర్లలో ఏర్పాటు చేసిన బ్యాటరీలను అనేక విధాలుగా టెస్ట్ చేసినట్లు హీరో తెలిపింది. దాదాపుగా 570కి పైగా టెస్ట్‌లను పాస్ అయినట్లు తెలిపారు. అందువల్ల బ్యాటరీతో ఎలాంటి ప్రమాదం ఉండదని.. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుందని తెలిపారు. అలాగే ఈ స్కూటర్లలో వినియోగదారులకు మూడు రకాల రైడింగ్ మోడ్స్ లభిస్తాయి. ఎకో, రైడ్, స్పోర్ట్ మోడ్‌లలో ఈ వాహనాలను నడపవచ్చు. దీన్ని బట్టి స్పీడ్, మైలేజీ వస్తాయి. అలాగే ఈ స్కూటర్లలో 7 ఇంచుల స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్కూటర్ ను ఆపరేట్ చేయవచ్చు. అయితే స్కూటర్‌కు సంబంధించి ఒక యాప్‌ను కూడా ఇస్తున్నారు. దీన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే.. ఫోన్‌ను స్కూటర్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. దీంతో స్కూటర్ ఫీచర్లు అన్నీ మన ఫోన్‌లోనే లభిస్తాయి. దీని వల్ల వాడడం సులభతరం అవుతుంది.

ఇక స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతోపాటు నావిగేసన్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ థ్రాటిల్, ఎస్‌వోఎస్ అలర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లను కూడా ఈ స్కూటర్లలో అందిస్తున్నారు. వీటిలో 26 లీటర్ల మేర బూట్ స్పేస్ లభిస్తుంది. ప్లస్ మోడల్ 3.4 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. ప్రొ మోడల్ అయితే 3.2 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఈ రెండు స్కూటర్స్ 0 నుంచి 80 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవలం 65 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అందువల్ల వీటిని వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్కూటర్లతో పోర్టబుల్ చార్జర్‌ను కూడా అందిస్తున్నారు. దీన్ని మన ఇంట్లో ఉండే 5 యాంప్స్ సాకెట్ బోర్డుతో ఉపయోగించుకోవచ్చు. సులభంగా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక పూర్తి స్థాయిలో బ్యాటరీలు చార్జింగ్ అవ్వాలంటే అందుకు 6 గంటల వరకు సమయం పడుతుంది.
హీరో విడా వి1 ప్లస్ ఢిల్లీ ఎక్స్-షోరూం ధర రూ.1.45 లక్షలు ఉండగా.. వి1 ప్రొ స్కూటర్ ధర రూ.1.59 లక్షలుగా ఉంది. సబ్సిడీ తరువాతే ఈ ధరలను అందుబాటులో ఉంచారు. ఇక ఈ స్కూటర్‌లు ముందుగా బెంగళూరు, ఢిల్లీ, జైపూర్ వాసులకు లభిస్తాయి. డిసెంబర్ రెండో వారం నుంచి వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచుతారు. రూ.2,499 చెల్లించి వీటిని ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ ఈ స్కూటర్‌లకు బైబ్యాక్ ఇన్సూరెన్స్‌ను కూడా అందిస్తోంది. 16 నుంచి 18 నెలల వాడకం అనంతరం ఈ స్కూటర్‌లను విక్రయించదలిస్తే స్కూటర్ ధరలో 70 శాతం మేర చెల్లిస్తారు. ఇలా అద్భుతమైన ఫీచర్లతో ఈ స్కూటర్‌లు అందుబాటులో ఉన్నాయి.