Hari Hara Veera Mallu : ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. 17వ శతాబ్దంలోని మొఘల్ ల సామ్రాజ్యం నేపథ్యంలో హరి హర వీరమల్లు కథ సాగుతుందని విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ మూవీ పీరియాడిక్ అడ్వెంచర్, యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ చిత్రానికి గాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. కీలక పాత్రల్లో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు. ఈ చిత్రం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతుండగా ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా క్రిష్ కు, పవన్ కు మధ్య విబేధాలు రావడంతో సినిమా ఆగిపోయిందని, తదితర కారణాలతో సినిమా ముందుకు సాగడం లేదనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇటీవల నిర్మాత ఏఎం రత్నం అన్ని సందేహాలకు చెక్ పెట్టారు. సినిమా షూట్ ప్రారంభం కాబోతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సమయం ఈ సినిమా కోసం డేట్ లను కేటాయించలేక పోతున్నారు. ఎట్టకేలకు ఈ సెప్టెంబర్ ఒకటవ తేది నుంచి సినిమాల షూటింగ్ లను పునః ప్రారంభించుకోవచ్చు అంటూ నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.

దీనితో దర్శకుడు క్రిష్ సెప్టెంబర్ మొదటి వారంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా హరి హర వీరమల్లు చిత్రానికి కేవలం 20 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించేందుకు ఓకే చెప్పారని సమాచారం వినిపిస్తోంది. డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకుంటూ రామోజీ ఫిలిం సిటీతోపాటు రామానాయుడు స్టూడియోలో భారీ ఎత్తున సెట్స్ వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
అవుట్ డోర్ షూటింగ్ అంటే పవన్ కళ్యాణ్ కు సమస్య అవుతుందని భావించి సాధ్యమైనంత వరకు సెట్స్ లోనే సినిమాలను పూర్తి చేసేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే భారీ బడ్జెట్ తో సెట్స్ ను నిర్మిస్తున్నామంటూ చిత్ర బృందం చెప్తున్నారు. వచ్చే ఏడాది 2023లో మార్చి 10న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేస్తోంది. భీమ్లా నాయక్ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో త్వరలో వస్తున్నాడంటే అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు.