Hardik Pandya : భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తనపై వస్తున్న వార్తలపై స్పందించాడు. తాను దుబాయ్ నుంచి వస్తూ రూ.5 కోట్ల విలువ చేసే 2 వాచ్‌లను తెచ్చానని వార్తలు వస్తున్నాయని.. అవి పూర్తిగా అబద్ధమని తెలిపాడు. తాను కేవలం ఒకే వాచ్‌ను తెచ్చానని అన్నాడు.
దుబాయ్ నుంచి వస్తూ అనేక వస్తువులను తాను తెచ్చానని.. వాటిల్లో ఒక వాచ్ మాత్రమే ఉందని, రెండు వాచ్‌లు లేవని.. పాండ్యా అన్నాడు. ఇక ఆ ఒక్క వాచ్ విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని తెలిపాడు. అయితే తాను స్వచ్ఛందంగా ముంబై కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లి తాను దుబాయ్‌లో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలను అందజేశానని.. వారు వాటికి సంబంధించిన పత్రాలను అడిగారని.. వాటిని కూడా తాను వారికి అందజేశానని తెలిపాడు.
ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు తన వస్తువులను, తాను అందించిన పత్రాలను పరిశీలిస్తున్నారని పాండ్యా తెలిపాడు. వారు ఆ వస్తువులకు ఎంత పన్ను విధిస్తే.. అంత మొత్తం చెల్లించి తన వస్తువులను తాను తిరిగి తీసుకుంటానని స్పష్టం చేశాడు. అంతేకానీ.. దుబాయ్‌లో తాను కొన్న 2 వాచ్‌లను సీజ్ చేశారని.. వస్తున్న వార్తల్లో నిజం లేదని.. వాటిని నమ్మవద్దని కోరాడు.
అయితే ఈ వార్తలను కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. తప్పు తెలుసుకుని నాలుక కరుచుకున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తల విషయంలో ప్రముఖ మీడియా సంస్థలు బోల్తా పడడం ఇదేమీ కొత్త కాదు. తాజాగా పాండ్యా విషయంలోనూ మరోమారు మీడియా సంస్థలు బోర్లా పడ్డాయి.
కాగా దుబాయ్‌లో భారత్ ఇటీవలే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్‌కు వెళ్లకుండానే భారత్ ఇంటికి తిరిగొచ్చింది. కొందరు ప్లేయర్లు మాత్రం అక్కడే విహారం కోసం ఉండిపోయారు. ఇక భారత్ నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో కలిసి టీ20లు, టెస్టులు ఆడనుంది.