IPL 2022 : దాదాపుగా రెండు నెలల నుంచి జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ ముగింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడిన టీమ్‌లు అలసిపోయాయి. ఈ క్రమంలోనే తుది పోరు కోసం కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనున్నాయి. ఈ రెండు జట్లలో విన్నర్ ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొనగా.. ఆరంభ టోర్నీలోనే గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. కొన్ని మ్యాచ్‌లు మినహా దాదాపుగా ఏకపక్షంగానే మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. కానీ ఆ తరువాత ఈ జట్టు మళ్లీ నెగ్గలేదు. దీంతో మరోమారు ట్రోఫీ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇక గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్‌లో గెలుపొందిన విజేతలకు ఈసారి రూ.20 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇక రన్నరప్ జట్టుకు రూ.13 కోట్లు వస్తాయి.

ఇక ఈసారి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్‌తోపాటు రూ.15 లక్షలు ప్రైజ్ మనీగా లభిస్తుంది. ఈ లిస్ట్‌లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు 16 మ్యాచ్ లు ఆడి 824 పరుగులు సాధించాడు. అలాగే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌తోపాటు రూ.15 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ లిస్ట్‌లో బెంగళూరు బౌలర్ హసరంగ, రాజస్థాన్ బౌలర్ చాహల్ ఉన్నారు. వీరు చెరో 26 వికెట్లు తీశారు. అయితే ఫైనల్ లో కనీసం ఒక వికెట్ తీసినా చాలు.. చాహల్‌కే పర్పుల్ క్యాప్ లభిస్తుంది. దీంతోపాటు ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.