Corona : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడింది. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సిద్ధం కాకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. అయితే కోవిడ్ మూడో వేవ్ డిసెంబర్ వరకు వస్తుందని, అయినప్పటికీ అది అంతగా ప్రభావం చూపకపోవచ్చని ప్రముఖ వైద్యుడు, కైలాష్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ మనీష్ శర్మ అన్నారు.
హెల్త్ గిరి అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన మనీష్ శర్మ పై వివరాలను వెల్లడించారు. దేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడైనా రావచ్చని, అయితే రెండో వేవ్‌లా ఈ వేవ్ ప్రమాదకరంగా ఉండదని అన్నారు. ఒక వేళ ప్రమాదకరంగా ఉన్నా అందుకు వైద్య రంగం సిద్ధంగా ఉందని అన్నారు.
ఇక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్నది పండుగల సీజన్ కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తగా లేకపోతే కోవిడ్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.