CM KCR Yadadri : యాదాద్రి ఆలయం ఎప్పటి నుంచి పునః ప్రారంభమవుతుందోనని ఎంతగానో ఎదురు చూస్తున్న భక్తులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆలయాన్ని వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే అంతకు వారం రోజుల ముందు 8 రోజుల పాటు మహా సుదర్శన యాగం ఉంటుందన్నారు. ఈ క్రమంలో 10వేల మంది రుత్విక్కులతో మహా సుదర్శన హోమం నిర్వహిస్తామని తెలిపారు.
కాగా మార్చి 28, 2022వ తేదీన మహా కుంభ సంప్రోక్షణ ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాగా ఆలయ పునఃప్రారంభ ఆహ్వాన పత్రికను త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి తన స్వదస్తూరితో రాసి ఇచ్చారు. దీంతో పత్రికను స్వామి వారి పాదాల చెంత ఉంచాలని కేసీఆర్.. ఈవోకు అందజేశారు.
ఇక ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు అవసరమైన బంగారంలో కొంత మేర విరాళంగా వస్తుందని, మిగిలిన భాగాన్ని ఆర్‌బీఐ నుంచి కొనుగోలు చేస్తామని తెలిపారు. తన కుటుంబం నుంచి 1 కిలో 16 తులాలకు పైగా బంగారాన్ని విరాళంగా సమకూరుస్తామని ప్రకటించారు. అలాగే మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కావేరీ సీడ్స్ నుంచి బంగారాన్ని విరాళంగా అందిస్తారని తెలిపారు.
మంగళవారం ఉదయం నుంచి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలోనే ఉన్నారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ మంటపం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు, గర్భాల ద్వారాలు తదితర నిర్మాణాలను పరిశీలించారు.