Chiranjeevi : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల గిరుల్లో కుంభ వృష్టి కురుస్తుండటంతో.. భక్తులు, తిరుపతి వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ముందు కురిసిన వర్షాలకే తిరుపతి వాసుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఇప్పటి వర్షాలకు చిత్తూరు జిల్లా మొత్తం వరదలతో అతలాకుతలం అవుతోంది. తిరుపతిలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. తిరుచానూరులోని వసుంధర నగర్‌లో ఓ ఇల్లు స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోవడంతో.. ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా.. రోడ్లు.. నదులను తలపిస్తున్నాయి.
వరద ప్రవాహ తీవ్రత కారణంగా.. ఆటోలు, బైకులు కొట్టుకుపోయాయి. గార్గేయి నది ఉగ్ర రూపం దాల్చడంతో.. చిత్తూరు జిల్లా సదుం సమీపంలో పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ పరిస్థితులు ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి.
దీనిపై తాజాగా స్పందించిన చిరంజీవి.. గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసులని కలిచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు కలసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులని నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను.. అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.