తెలంగాణలో గత కొద్ది రోజులుగా వరి ధాన్యం కొనుగోళ్లపై అటు బీజేపీ, ఇటు తెరాస ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. యాసంగిలో కొనుగోలు చేయబోయే వరి ధాన్యంపై స్పష్టతను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం మాత్రం బాయిల్డ్ రైస్ కొనబోమని, రా రైస్‌ను మాత్రమే కొంటామని చెబుతున్నారు.
ఇక వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో సమావేశం అయ్యారు కూడా. కానీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలను కేంద్రం చెప్పలేదు. దీంతో కేంద్రం సందిగ్ధంలో ఉందని తెరాస ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అయితే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలకప్రకటన చేసింది. తెలంగాణలో యథావిధిగానే ధాన్యం కొంటామని కేంద్రం తెలిపింది. గతంలో చెప్పిన ధరకే ధాన్యాన్ని కొంటామని తెలిపింది. దీంతో వరిధాన్యం కొనుగోలుపై ఉన్న గందరగోళానికి తెర పడినట్లు అయింది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.