Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో త్వరలోనే ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ షో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మొత్తం 84 రోజుల పాటు షో జరగనుండగా.. దీన్ని టెలివిజన్‌లో కాకుండా ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అందులో భాగంగానే ఈ షోను తొలిసారిగా రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేయదలిచారు. దీంతో ఈ షో పట్ల బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ షోకు గాను నిర్వాహకులు ప్రస్తుతం కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు కొందరు తెలుగు ఫీమేల్ యూట్యూబ్ స్టార్స్‌ను ఈ షో కోసం అడిగారట. అయితే ఈ షో విన్నర్ ప్రైజ్ మనీ మరీ తక్కువని తెలుస్తోంది. టీవీ బిగ్ బాస్ షోకు రూ.50 లక్షల నుంచి కొన్ని భాషల్లో రూ.1 కోటి వరకు ప్రైజ్ మనీని ఇస్తున్నారు. అయితే ఈ ఓటీటీ షోకు మాత్రం కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలను మాత్రమే విన్నర్‌కు ఇస్తామని చెప్పారట.
దీంతో సదరు ఫీమేల్ యూట్యూబ్ స్టార్స్ ఈ షోలో పాల్గొనలేమని చెప్పారట. ఎందుకంటే వారు అన్ని రోజుల పాటు హౌస్‌లో ఉంటే వారికి లభించే మొత్తం తక్కువే. అదే బయట ఉంటే యూట్యూబ్, ఇతర సోషల్ సైట్ల ద్వారా ఇంకా ఎక్కువగానే సంపాదిస్తారట. కనుక వారు ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ నిర్వాహకులు దీనిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రైజ్ మనీని మరికాస్త పెంచితే ఈ ఆఫర్ కోసం ఎవరైనా సరే షోలో పాల్గొంటారని.. నిర్వాహకులు భావిస్తున్నారట. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.