Bhanu Priya : కళ్లతోనే భావాలు పలికించే అందాల అభినేత్రి భానుప్రియ. 1989-90 దశాబ్ద కాలంలో తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పదహారణాల తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భానుప్రియ అసలు పేరు మంగభాను. ఆమె రాజమండ్రి సమీపంలోని రంగంపేట అనే ఊరులో జన్మించింది. భానుప్రియ తండ్రి పండుబాబు, తల్లి పేరు రాగమాలి. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన భానుప్రియ కూచిపూడి, భరతనాట్యంలో మంచి ప్రావీణ్యత సంపాదించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో సుమారు 150 చిత్రాలకు పైగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకుంది.
తెలుగులో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటించి ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనకు గుర్తుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది భానుప్రియ. దర్శకుడు వంశీ డైరక్షన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ సితార చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది. ఆ సినిమా జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడంతో భానుప్రియ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.

ఆ తర్వాత వంశీ డైరక్షన్ లో వచ్చిన అన్వేషణ, ఆలాపన చిత్రాలు కూడా నటిగా భానుప్రియకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు ఆ మూడు చిత్రాలు భానుప్రియ కోసమే వంశీ తెరకెక్కించాడేమో అన్నట్టుగా ఉంటాయి. ఒక దశలో ఆయన భానుప్రియను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ కూడా చేయగా, ఆమె తల్లి రాగమాలి అభ్యంతరం చెప్పిందట. దీనికి కారణం అప్పటికే వంశీకి పెళ్లయిపోయి ఉండడమే.
ఇక ఆ తర్వాత భానుప్రియ కెరీర్ పై దృష్టి పెట్టి తెలుగు , తమిళంలో అనేక మరపురాని చిత్రాల్లో నటించి ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఒక దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చిన భానుప్రియ వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా జరగలేదు. కెరీర్ స్లో అవుతుందన్న సమయంలో చెన్నైకి చెందిన ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్ ను పెళ్లాడింది. అమెరికాలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది. భానుప్రియ, ఆదర్శ్ దంపతులకు అభినయ అనే పాప కూడా ఉంది. అయితే పాప పుట్టిన తర్వాత వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విభేదాలు మరీ శృతిమించిపోవడంతో భర్త నుంచి విడిపోయి తిరిగి ఇండియా వచ్చేసింది భానుప్రియ.
అప్పటి నుంచి చెన్నైలో ఉంటూ అడపాదడపా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ పాపను పోషించుకుంటోంది. చెన్నైలో ఓ డ్యాన్స్ స్కూల్ స్థాపించి కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తోంది. అయితే కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా, గౌతమ్ ఎస్ఎస్ సి చిత్రంలో డాక్టర్ గా కనిపించిన భానుప్రియ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం భానుప్రియ మొదటి కర్తవ్యం తన కుమార్తెను ప్రయోజకురాలిని చేయడమే అని, ఆమె కోసం మరికొన్నాళ్ల పాటు సినిమాలో నటించాలని ఉన్న కూడా తనకు అవకాశాలు ఇచ్చే వాళ్లు కనిపించడంలేదని భానుప్రియ తన సన్నిహితుల వద్ద చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారట.