Andhra Pradesh : ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ లో ఎన్నో మార్పులు జరిగాయి. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై దృష్టి పెట్టారు. వైఎస్ ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జరిగిన చర్చలలో కొత్త జిల్లాలపై సీఎం కీలకమైన చర్చను నిర్వహించారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఇక నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనగణన ముగిసేవరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక హద్దులు మార్చడానికి కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకే జిల్లాల పునర్విభజనకు బ్రేక్ పడింది. ఏపీ రాష్ట్రంలో లోక్ సభ పార్లమెంట్ కు ఒక జిల్లాగా డివైడ్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈ రకంగా విభజిస్తే.. ఏపీకి 26 జిల్లాలు వస్తాయి. కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో లోక్ సభ నియోజకవర్గాలను చూస్తే.. 25 జిల్లాలు వస్తున్నాయి.
ముఖ్యంగా అరకు పార్లమెంట్ పెద్దది కనుక ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు చేసే పనిలో ఉంది. ఈ జిల్లాలను విభజించే క్రమంలో కాలేజీలు, రోడ్లు, మెయిన్ బిల్డింగ్స్ లాంటి వాటిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంది. లోక్ సభ నియోజకవర్గాల పరిధి, విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. పోలీసు శాఖ సైతం తమకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఈ కొత్త జిల్లాల టాపిక్ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడే వచ్చినా.. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ అంశం తెరపైకి వచ్చింది.