Anasuya : గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై వార్తలలో నిలుస్తూ ఉంటుంది అనసూయ. టీవీ9 యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయకు పాపులారిటీ వచ్చింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే. తన మాటలతోనే కాకుండా అందచందాలతోనూ అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ యాంకరమ్మ. అనసూయ వేసుకొనే పొట్టి బట్టలపై ఒక్కోసారి వివాదం చెలరేగుతూ ఉంటుంది. వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా అనసూయ గ్లామర్ షోతో అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి అనసూయ తనలో కొత్త కోణాన్ని పరిచయం చేసింది. పుష్ప చిత్రంలో దాక్షాయని పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. తనకంటూ నటన పరంగా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కొన్ని కారణాల వలన అనసూయ జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా అనసూయ ఒక ఇంటర్వ్యూ ద్వారా క్యాస్టింగ్ కౌచ్ అనే భూతం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను ఎప్పుడూ అవకాశాల కోసం వెళ్లలేదని, కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే సద్వినియోగం చేసుకున్నానని చెప్పుకొచ్చింది. అందరికీ రంగుల ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. సోషల్ మీడియా పరంగా ఎవరికి నచ్చిన విధంగా వారు కాస్టింగ్ కౌచ్ గురించి కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే పరిమితమై ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. లైంగిక వేధింపులు అనేవి కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, మిగతా చోట్ల కూడా ఉన్నాయి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అనసూయ.
అదృష్టవశాత్తూ నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని తెలిపింది. అవకాశాల కోసం మనం తప్పు చేయకుండా ఎదురు చూడాలని, అది మనం స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. చాలామంది చెప్తూనే ఉంటారు.. నీకు ఆ సినిమాలో ఛాన్స్ కావాలంటే నువ్వు ఈ విధంగా చేయాలి అని.. మనం అలాంటి ఆఫర్లకు తలవంచకూడదు. దాని బదులు అవకాశాన్ని వదులుకోవడం ఉత్తమం. ఈ ఛాన్స్ కాకపోతే దానికి మించిన అవకాశం మన దగ్గరికి వస్తుంది అంటూ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ.