Airtel : దేశవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు ఎయిర్‌టెల్ శుభవార్త చెప్పింది. దేశంలోని పలు ఎంపిక చేసిన నగరాల్లో 5జి సేవలను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో పాల్గొన్న ఆయన తమ నెట్‌వర్క్‌లో 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.
కాగా ఎయిర్‌టెల్ 5జి సేవలు మొత్తం 8 నగరాల్లో నేటి నుంచి లభ్యం కానున్నాయి. వాటిల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఇక మిగిలిన నగరాల విషయానికి వస్తే.. ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, ముంబై, చెన్నై, సిలిగురి తదితర నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో శనివారం నుంచే 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలియజేసింది. ఇక వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో అన్ని చోట్లా 5జి సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎయిర్ టెల్ ప్రతినిధులు తెలియజేశారు.

కాగా గతంలో నిర్వహించిన 5జి స్పెక్ట్రమ్ వేలంలో రూ.43వేల కోట్లకు గాను ఎయిర్‌టెల్ 19,867.8 మెగాహెడ్జ్‌లో బ్యాండ్‌ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే గతేడాది నుంచే నోకియా, ఎరిక్‌సన్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు గతంలోనే ఎయిర్ టెల్ వెల్లడించింది. అయితే మరోవైపు జియో కూడా 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కానీ జియో 5జి సేవలు ప్రస్తుతం చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. ఆ లిస్ట్‌లో హైదరాబాద్ లేదు. కానీ హైదరాబాద్ వాసులకు ఎయిర్‌టెల్ ముందుగా 5జి సేవలను అందుబాటులోకి తెచ్చింది.