Ulli Mamidi Pachadi : వేసవికాలంలో లభించే పచక్చి మామిడికాయలను నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మామిడికాయలతో చేసే వంటకాలు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే పచ్చి మామిడికాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పచ్చి మామిడికాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీ నూనె – 2 టీ స్పూన్స్, పల్లీలు – గుప్పెడు, మెంతి గింజలు – 10, ఎండుమిర్చి – 15 నుండి 20, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పుల్లటి మామిడికాయ – 1, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెమ్మలు – 5, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు – 2.

ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మెంతి గింజలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత మామిడికాయపై ఉండే చెక్కును తీసేసి తురుముకోవాలి. తరువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత మామిడికాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పచ్చడికి తాళింపు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.