Mango Chicken Curry : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ తో ఎక్కువగా కర్రీని తయారు చేస్తూ ఉంటాము. చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. మనం సులభంగా, వెరైటీగా చేసుకోదగిన చికెన్ కర్రీలల్లో మామిడికాయ చికెన్ కర్రీ కూడా ఒకటి. మామిడికాయతో చికెన్ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా..? పచ్చి మామిడికాయ వేసి కూడా మనం చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ పుల్ల పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కావాలనుకునే వారు దీనిని తప్పకుండా రుచి చూడాల్సిందే. మామిడికాయలతో రుచిగా, కమ్మగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెమ్మలు – 10 నుండి 12, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 5 లేదా 6, నూనె – 6 నుండి 7 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కరివేపాకు – 2 రెమ్మలు, చికెన్ – అరకిలో, కారం – అర టేబుల్ స్పూన్ నుండి ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, చెక్కు తీసిన పచ్చి మామిడికాయ ముక్కలు – పావు కప్పు నుండి అర కప్పు ( పులుపును బట్టి), తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గరం మసాలా – అర టీ స్పూన్.

మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 5, మిరియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక అంగుళం ముక్క, యాలకులు – 4, ఎండుమిర్చి – 4 లేదా 5, నానబెట్టిన జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్.
మామిడికాయ చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో జీడిపప్పు తప్ప మిగిలిన మసాలా పదార్థాలు వేసి చిన్న మంటపై బాగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కూడా వేసి తగినన్నినీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత మరో జార్ లో వెల్లుల్లి రెమ్మలు, అల్లం, పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇవి వేగుతుండగానే కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని పెద్ద మంటపై ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. చికెన్ ఎర్రగా వేగిన తరువాత కారం, పసుపు వేసి కలపాలి.
ఇవి మాడిపోకుండా 3 టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసి కలపాలి. దీనిని నూనెపైకి తేలే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి చికెన్ ను 80 శాతం ఉడికించాలి. చికెన్ 80 శాతం ఉడికిన తరువాత మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర ఉడికేటప్పుడే రుచిని చూసుకోవాలి. మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే ఉప్పు, కారం సరి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.