Fish And Weight Loss : చేపలను తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మనకు చేపల ద్వారా లభిస్తాయి. ఈ క్రమంలోనే తరచూ చేపలను తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే చేపలను తింటే అధిక బరువు తగ్గవచ్చా, లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి చేపలు నిజంగానే బరువు తగ్గేందుకు దోహదపడతాయా..? చేపలను తింటే బరువు తగ్గుతారా..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలను తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. అయితే వారంలో ఒకటి, రెండు సార్లు చేపలను తినడం కాదు.. నిత్యం చేపలను తినాల్సిందే. రోజూ 140 గ్రాముల మోతాదులో చేపలను తింటే అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. అందువల్ల బరువు తగ్గుతారు.
ఇక చేపల్లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. అందువల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అలాగే కండరాల నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా శరీరంలో కొంత కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అందువల్ల చేపలను తింటే అధిక బరువు కచ్చితంగా తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు.