Immunity : వర్షాకాలం ప్రభావం అసలు ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఈ సీజన్‌లో వర్షాలు నిరంతరాయంగా పడుతూనే ఉంటాయి. దీంతో వాతావరణం చల్లగా ఉంటుంది. అయితే చల్లని వాతావరణం ఉందని చెప్పి చాలా మంది వీధుల్లో లభించే చిరుతిండ్లను ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా బజ్జీలు, పునుగులు, వడలు, గారెలు, పానీ పూరీ, పకోడీ.. వంటి వాటిని ఈ సీజన్‌లో ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే ఇలాంటి ఫుడ్స్‌ను ఈ సీజన్‌లో తినడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో తీసుకునే ఆహారాల పట్ల జాగ్రత్త వహించాలని వారు అంటున్నారు. ఇక ఈ సీజన్‌లో ఏయే ఆహారాలను తీసుకోకూడదు, వేటిని తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సమోసాలు, కచోరీలు, బ్రేడ్ పకోడీలు, కట్‌లెట్స్ వంటి అనేక రకాల చిరుతిండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈ సీజన్‌లో అసలు తినకూడదు. వీటిని బాగా డీప్ ఫ్రై చేసి, అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తారు. దీంతో వీటిని తింటే ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కనుక ఈ ఆహారాలకు ఈ సీజన్‌లో దూరంగా ఉండాలి.
కొందరు నీళ్లను అసలు తాగరు. వర్షాకాలంలో చల్లగా ఉంటుంది కనుక నీళ్లను తాగాల్సిన అవసరం ఉండదు. కానీ రోజుకు సరిపడా నీళ్లను అయితే కచ్చితంగా తాగాలి. లేదంటే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. దీంతో రోగాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొందరు పెరుగు, మజ్జిగ, పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోరు. కానీ ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని ప్రొ బయోటిక్ ఫుడ్స్ అంటారు. కాబట్టి ఈ సీజన్‌లో మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే పాలు లేదా పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. బరువు పెరుగుతామన్న భయం ఉంటే కొవ్వు తీసిన పాలను ఉపయోగించవచ్చు. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.
చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, బయట బండ్లపై అమ్మే పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్‌ను కూడా ఈ సీజన్‌లో అధికంగా తీసుకోకూడదు. ఇవి ఈ సీజన్‌లో హానికర బాక్టీరియాలను కలిగి ఉంటాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు లేదా జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సీజన్‌లో కొందరు ఆహారం సరిగ్గా జీర్ణం అవడం లేదని ఇష్టం వచ్చిన సమయంలో భోజనం చేస్తుంటారు. అలా చేస్తే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కనుక వేళకు భోజనం చేయాలి. ఒక వేళ మీకు ఆకలిగా అనిపించకపోతే పండ్లను తినవచ్చు. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తాయి. కనుక ఈ అలవాట్లను పాటిస్తే వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.