చికెన్‌తో ఏ వెరైటీ చేసినా చాలా మందికి నచ్చుతాయి. ముఖ్యంగా తందూరీ చికెన్ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలా ? అని ఆలోచిస్తుంటారు. కానీ కొద్దిగా శ్రమించాలే కానీ ఇంట్లోనే రుచికరమైన తందూరీ చికెన్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి అందుకు ఏమేం కావాలో, తందూరీ చికెన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
తందూరీ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు
- చికెన్ – అర కిలో (పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి)
- ఉల్లిపాయలు – ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి)
- నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు – 3 లేదా 4
- అల్లం – చిన్న ముక్క
- ఎరుపు రంగు ఫుడ్ కలర్ – కొన్ని చుక్కలు
- పచ్చిమిరప కాయలు – 2 లేదా 3
- గరం మసాలా పొడి – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – తగినంత
తందూరీ చికెన్ తయారీ విధానం
ముందుగా చికెన్ ముక్కలను కడిగి బాగా ఆరిన తరువాత వాటికి చిన్న గాట్లు పెట్టుకుని వాటిల్లో నిమ్మరసం, ఉప్పు కలిసేలా పట్టించి ఫ్రిజ్‌లో 20 నిమిషాలు పెట్టుకోవాలి. ఈ లోగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, గరం మసాలా పొడి, రెడ్ ఫుడ్ కలర్ అన్నీ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చికెన్ ముక్కలను బయటకు తీసి ఈ మసాలాను ముక్కలకు బాగా పట్టించి అనంతరం ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత బాండీలో నూనె పోసి కాగిన తరువాత చికెన్ ముక్కలను దోరగా వేయించుకోవాలి. అన్ని ముక్కలను ఒకేసారి కాకుండా రెండు మూడు చొప్పున తీసి వేయించుకోవాలి. దీంతో రుచికరమైన తందూరీ చికెన్ తయారవుతుంది. దాన్ని నేరుగా తినవచ్చు. పుదీనాతో చట్నీ చేసుకుని అందులో ఆ ముక్కలను ముంచి తింటుంటే ఎంతో రుచిగా ఉంటాయి.