వర్షాకాలం కావడంతో చాలామంది ఏదైనా వేడివేడిగా తినాలని లేదా తాగాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే చల్లని వాతావరణంలో వేడి వేడిగా చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారుచేసుకొని తాగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు
- చికెన్ – 100 గ్రాములు
- స్వీట్ కార్న్ – 2 కప్పులు
- క్యారెట్ ముక్కలు – అర కప్పు
- మిరియాలపొడి – 1 టీ స్పూన్
- కారం పొడి – అర టీ స్పూన్
- కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడినంత
- పసుపు – చిటికెడు
- నూనె – తగినంత
- నీరు – తగినంత
చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలోకి చికెన్ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకోవాలి. కొద్దిసేపటి తరువాత చికెన్ లో వచ్చిన నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తరువాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి బాగా వేయించాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలోకి సుమారుగా లీటర్ వరకు నీటిని పోసి బాగా మరిగించాలి. ఉడుకుతున్న ఈ మిశ్రమంలో మిరియాల పొడి, కారం వేసి ఉడికించాలి. తరువాత ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి పదిహేను నిమిషాలపాటు బాగా ఉడికించాలి. తరువాత ఒక గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకొని కార్న్ పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఉడుకుతున్న చికెన్ ముక్కలలో వేసి మరో 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే.. ఎంతో రుచికరమైన చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారైనట్లే. చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఈ సూప్ తాగుతుంటే భలేగా ఉంటుంది.