ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మృగశిర కార్తె వచ్చేసింది. జూన్ 8 (మంగళవారం) నుంచి ఈ కార్తె ప్రారంభమవుతుంది. అయితే మృగశిర కార్తె రాగానే చేపలను ఎక్కువగా తింటుంటారు. నిజానికి ఈ కార్తెకు, చేపలను తినేందుకు అసలు సంబంధం ఏమిటి ? ఈ కార్తె ప్రారంభం కాగానే చేపలను తినాలా ? దాంతో ఏమైనా లాభాలు ఉంటాయా ? అంటే..
మొత్తం 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశాన్ని బట్టి కార్తెలు ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలోనే రోహిణికార్తె ముగిశాక మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని చెబుతారు. వెంటనే మృగశిర ప్రారంభం అవుతుంది. ఈ కార్తెలో సహజంగానే వాతావరణం చల్లబడుతుంది. రుతు పవనాలు ప్రారంభం అవుతాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. దీని వల్ల సూక్ష్మ జీవులు పెరుగుతాయి. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, ఫ్లూ, విష జ్వరాలు వస్తాయి. అయితే ఆయా రోగాలు రాకుండా ఉండాలనే మృగశిర ఆరంభం కాగానే చేపలను తినమని చెబుతుంటారు.
చేపలను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, డయాబెటిస్ ఉన్నవారు చేపలను తింటే ఎంతో మేలు చేస్తాయి. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అందుకనే మృగశిర ఆరంభం రోజున చేపలను తినాలని చెబుతారు.
అయితే శాకాహారులు ఇంగువ, బెల్లం కలిపి తింటే మంచిది. ఇక మిగిలిన ఎవరైనా సరే చేపలను తినవచ్చు. అందుకనే మృగశిర కార్తె రాగానే మనకు ఎక్కడ చూసినా చేపలు కనిపిస్తాయి. చేపలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నిషియం, కాపర్, జింక్ తదితర పోషకాలు ఉంటాయి. దీని వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. చేపలను తింటే హైబీపీ తగ్గుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చేపల్లో విటమిన్ బి12, రైబో ఫ్లేవిన్, నియాసిన్, బయోటిన్, థయామిన్ తదితర విటమిన్లు ఉంటాయి. అలాగే విటిమన్ ఎ, డి, ఇ లు కూడా లభిస్తాయి.
గర్భిణీలు చేపలను తీసుకోవడం వల్ల వారికి, వారి గర్భాశయంలో ఎదిగే పిల్లలకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. చిన్నారులలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. చేపలను కొందరు చింత చిగురుతో కలిపి వండుకుని తింటారు. ఎలా తిన్నా మేలే జరుగుతుంది.